రెండో టెస్టులో ఏం చేస్తారో?: సెంచూరియన్‌లో కోహ్లీసేన ప్రాక్టీస్

Spread the love

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ కోసం కోహ్లీ సేన కేప్‌టౌన్‌ నుంచి సెంచూరియన్‌ చేరుకుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు పాల్గొన్నారు. అయితే సెంచూరియన్‌లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో తొలి టెస్టులో ఆడని ఆటగాళ్లే ఎక్కువగా కనిపించడం విశేషం. ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తొలి టెస్టు ఓటమితో రెండో టెస్టులో కోహ్లీ కొన్ని మార్పులతోనే బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక, తొలి టెస్టు ప్రారంభానికి ముందు జ్వరంతో బాధపడిన రవీంద్ర జడేజా కోలుకున్నాడు.

గురువారం నిర్వహించిన నెట్ ప్రాక్టీస్‌కు కూడా హాజరయ్యాడు. దీంతో అతడు రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, రహానే, కేఎల్‌ రాహుల్‌, పాండ్యా, పుజారా, కోహ్లీ కూడా గురువారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. తొలి టెస్టు తుది జట్టు ఎంపిక సరిగా లేదని విమర్శలు రావడంతో ఇప్పుడు రెండో టెస్టులో కోహ్లీ ఎవరికి తుది జట్టులో స్థానం కల్పిస్తాడన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విదేశీగడ్డపై మంచి రికార్డున్న రహానేను తప్పించడం పట్ల దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌తో పాటు ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండో టెస్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ స్ధానంలో కేఎల్‌ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవచ్చనే వార్తలు వినపడుతున్నాయి. మరోవైపు రహానే విషయంలో మాత్రం సందిగ్థత నెలకొంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.