భారత జట్టులోకి కొత్తగా మరో యువ తేజం

Spread the love

దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ సేన తలమునకలవుతోంది. ఇప్పుడు కోహ్లీసేనతో పాటుగా భారత్ నుంచి మహిళల జట్టుకు కూడా వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు మిథాలీ‌రాజ్ యే సారథిగా వ్యవహరించనున్న నేపథ్యంలో మహిళల జట్టులో మరో యువ కెరటం అడుగుపెట్టింది. జట్టులో చోటు దొరికిన ఆనందంలో ఉన్న భాటియా తన భావోద్వేగాన్ని ఇలా పంచుకుంది. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత మహిళల క్రికెట్‌ జట్టులో చోటు సంపాదించిన 20 ఏళ్ల తానియా భాటియా.. ఈ అవకాశం కోసం ఎప్పట్నుంచో ఆశగా ఎదురుచూస్తున్నానని, ఇది తనకు కొత్త ఆరంభమని తెలిపింది. ‘ఇది నాకు కొత్త ఆరంభం. ఎప్పట్నుంచో భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాను.

గత ఏడాది ప్రపంచకప్‌ జట్టుకు మిస్సయ్యాను. విరామ సమయంలో మంచి శిక్షణ పొందాను. భారత జట్టులో సుష్మా ప్రధాన వికెట్‌ కీపర్‌. సఫారీ పర్యటనకు ఆమె కూడా ఎంపికైంది. ఏదైనా మ్యాచ్‌కి సుష్మా స్థానంలో నాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా మంచి‌ ప్రదర్శన చేస్తాను. దక్షిణాఫ్రికాలో బౌన్సీ పిచ్‌లపై ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.’ అని తెలిపింది భాటియా. తానియా తన ఏడేళ్ల వయసు నుంచి క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టింది. యువరాజ్‌ సింగ్‌ తండ్రి, మాజీ క్రికెటర్‌ అయిన యోగ్‌రాజ్‌ సింగ్‌ వద్ద శిక్షణ తీసుకుంది. 13 ఏళ్ల వయసులోనే ఆమె పంజాబ్‌ జట్టుకు ఎంపికై చరిత్ర సృష్టించింది. తానియా తండ్రి సంజయ్‌ భాటియా సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగి.

సంజయ్‌ కూడా క్రికెట్‌ ఆడేవాడు. తానియా భారత జట్టుకు ఎంపికవ్వడంపై సంజయ్‌ మాట్లాడుతూ..’నేను సాధించలేనిది ఈ రోజు నా కూతురు సాధించింది. చాలా సంతోషంగా ఉంది. ఏడేళ్ల వయసు నుంచి తానియా క్రికెట్‌ ఆడుతోంది. తానియా క్రికెట్‌ సాధన కోసం నా భార్య సప్న చాలా కష్టపడింది. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’ అని సంజయ్‌ వివరించారు. తానియా ప్రస్తుతం ఎమ్‌సీఎమ్‌ దావ్‌ మహిళా కళాశాలలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.