పాండ్యాది రేర్ టాలెంట్, జట్టులోకి రావడానికి కారణం అతనే

Spread the love

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన క్రికెటర్ అని అండర్-19, ఇండియా ఏ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత్‌లో ఫాస్ట్ బౌలింగ్ చాలా తక్కువ మంది ఉన్నారని, అలా తనకు అందివచ్చిన అవకాశాన్ని పాండ్యా సద్వినియోగం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. జనవరి 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ పృథ్వీ షాతో కలిసి బుధవారం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చాలా వేగంగా సీనియర్ జట్టులోకి దూసుకొచ్చిన పాండ్యా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడని ప్రశంసించాడు.

‘పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లభించడం భారత్‌కు గొప్ప వరం. ఈ అవకాశాన్ని పాండ్యా రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. పాండ్యా జట్టులోకి రావడానికి కారణం అతనే. అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచి కీలక ఆటగాడిగా ఎదిగాడు. భారత్‌లో ఫాస్ట్ బౌలర్ ఆల్‌రౌండర్లకి పెద్దగా పోటీ ఉండదు’ అని ద్రవిడ్ తెలిపాడు. ‘ఒకవేళ బ్యాట్స్‌మన్, స్పిన్ బౌలర్‌గా ఎదగాలనుకుంటే భారత్‌లో చాలా మందితో పోటీపడాల్సి ఉంటుంది. కానీ భారత్‌లో పేస్ ఆల్‌రౌండర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. భారత్ తరుపున ఫాస్ట్ బౌలర్ల ఆల్ రౌండర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు’ అని అన్నాడు.

యువ ఆటగాళ్లను వెలికి తీయడం కోసమే ద్రవిడ్‌ను బీసీసీఐ అండర్-19, ఇండియా ఏ జట్ల కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ‘నేను భారత్ ఏ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే సెలక్షన్ కమిటీతో కలిసి ఫాస్ట్ బౌలర్ ఆల్‌రౌండర్స్ కోసం అన్వేషణ మొదలు పెట్టాలనుకున్నా. విజయ్ శంకర్, స్టువర్ట్ బిన్నీ ఆ పాత్రను పోషించారు. అయితే విజయ్ గాయం కారణంగా ఆసీస్ పర్యటనకు దూరం కావడంతో అతని స్థానంలో ఎంపికైన పాండ్యా ఆసీస్ పిచ్‌లపై పదునైన పేస్ బౌలింగ్‌తో, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’ అని ద్రవిడ్ చెప్పాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.