పిచ్‌లో ముద్దులతో గెలుపు సంబరాలు

Spread the love

ఆనందాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. గంగూలీ ఒకప్పుడు మ్యాచ్ గెలిచినందుకు షర్ట్ తీసేసి తిరిగి తన ఆనందాన్ని వ్యక్తపరిచిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలానే భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓ ఘటన జరిగింది. తమకు తాముగా దక్షిణాఫ్రికా జట్టు వెల్లడించేదాకా ఈ విషయాన్ని మీడియా పసిగట్టలేకపోయింది. తొలి టెస్టులో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

సరిగ్గా అదే సమయానికి హార్దిక్‌ పాండ్యా దిగి స్కోరును పరుగులెత్తించడం మొదలెట్టాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఎవరూ ఊహించని విధంగా స్కోరు చేశాడు. పాండ్యాను అవుట్ చేయాలన్న కసితో ఉన్న రబాడ 70వ ఓవర్‌ వేసేందుకు బంతిని అందుకున్నాడు. తొలి బంతికే పాండ్య(93) డీకాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనుకున్నది చేయగలిగాడు రబాడ. అప్పటివరకు ఒంటరి పోరాటం చేస్తున్న పాండ్య వికెట్‌ తీసి పెవిలియన్‌కు పంపాడు. ఈ పరిణామానికి దక్షిణాఫ్రికా సారథి డూప్లిసిస్‌ రబాడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టరాని సంతోషంతో అతన్ని ముద్దు పెట్టుకున్నాడు.

తొలి టెస్టులో రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లను తీయగలిగాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఈ కారణంగానే రబాడ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డుప్లెసిస్ తాను రబాడను ముద్దు పెట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నాడు. అంతేగాక నంబర్‌వన్‌ స్థానం దక్కించుకున్నందుకు అభినందనలు తెలిపాడు. దీనికి రబాడ ‘ఈ ఫొటో చూసి నా గర్ల్‌ఫ్రెండ్‌ ఇదేమిటంటూ ప్రశ్నించింది’ అని సరదాగా కామెంట్‌ పెట్టాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.