చివరి నిమిషయంలో వైసీపీ అవుట్

Spread the love

శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపింది. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీల నుంచి రేసులో ఉన్నది వీరే అంటూ ప్రచారం జోరుగా సాగింది. ఆయా పార్టీ నుంచి రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌‌కు మంగళవారం తుది గడువు. కానీ సోమవారం సాయంత్రం వరకు టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థి ఎవరనేది తేల్చనేలేదు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎవరనే విషయమై టీడీపీ, టీడీపీ నుంచి ఎవరిని బరిలో దింపుతారో చూద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేచి చూసే ధోరణిలో వ్యవహరించాయి.

ఈ నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో అనూహ్యంగా తప్పుకుంది. ఆ పార్టీ నుంచి గౌరు వెంకటరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు నాగిరెడ్డి, రవికిశోర్‌ రెడ్డి పేర్లు వినిపించాయి. టీడీపీ నుంచి శివానందరెడ్డి పేరు తెరపైకి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ బరి నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. అందుకు వైఎస్ఆర్‌సీపీ నేతతో శివానందరెడ్డి బంధుత్వం ఉండడమే కారణమని అంటున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరి నుంచి తప్పుకుందన్న వార్తలు మీడియాలో వస్తున్న సమయంలోనే టీడీపీ అధిష్టానం తన అభ్యర్థిని ఖరారు చేసింది. కేఈ ప్రభాకర్‌ను తమ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్, శివానందరెడ్డి, చల్లా శ్రీధర్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరుల పేర్లు ముందుగా వినిపించాయి. వీరిలో శివానందరెడ్డి తప్ప ఎవరు బరిలో నిలిచినా తాము పోటీలో ఉండాలని వైఎస్ఆర్‌సీపీ భావించిందని చెబుతున్నారు.

శివానందరెడ్డిని ముందుకు తీసుకువచ్చి వైఎస్ఆర్‌సీపీని పోటీ నుంచి తప్పుకునేలా చంద్రబాబు వ్యూహం రచించారని అంటున్నారు. కాగా.. పోటీ నుంచి తప్పుకోవడంపై వైసీపీ నేత బీవై రామయ్య స్పందించారు. తమకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎక్కువగా ఉన్నారని, అయినప్పటికీ తాము పోటీ చేయడం లేదని చెప్పారు. మరోసారి టీడీపీ తమ పార్టీ నేతలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా చూసేందుకే పోటీ చేయడం లేదన్నారు. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేయాల‌న్నదే త‌మ‌ ల‌క్ష్యమ‌ని వైసీపీ నేత బీవై రామ‌య్య చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేస్తోందని ఆయన విమర్శించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.