వంగవీటి చూపు.. టీడీపీ వైపు.. ఎందుకు..?

Spread the love

విజయవాడలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగలనుందా? పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధ టీడీపీలో చేరనున్నారా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇది నిజమనే అనిపిస్తోంది. అనునిత్యం వైఎస్ జగన్ వెంటే నడుస్తానని చెప్పే ఆపార్టీ సీనియర్ నేత వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న వార్త ఇప్పుడు విజయవాడలో సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా వంగవీటి రాధ పార్టీ మార్పుపైనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రాధ పార్టీమార్పుపై అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ, అటు తెలుగుదేశం వర్గాలు, ఇటు రాధ అనుచరులు పార్టీ మార్పు ఖాయమంటున్నారు.
వంగవీటి రాధకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఖాయం చేసిన పక్షంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటీకే రాధ పార్టీ మార్పుపై టీడీపీ నేతలు తమతో చర్చించారని రాధ ప్రధాన అనుచరులు తెలిపారు. వంగవీటి రాధ టీడీపీలో చేరితే, అది వైఎస్ఆర్సీపీకి కోలుకోని దెబ్బే.
మరోవైపు వంగవీటి రాధ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైపోయిందని ఆపార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలలో సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లనుండగా, ఆయన అక్కడి నుంచి తిరిగి రాగానే రాధ చేరిక ఉంటుందని తెలిపాయి. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి మరింత మంది నేతలు టీడీపీలోకి రానున్నట్లు తెలుస్తోంది. జగన్ వైఖరితో వారంతా విసిగిపోయి వారు టీడీపీలోకి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నారని టీడీపీ వర్గాల సమాచారం. రాధ చేరికతో కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింతగా బలపడుతుందని, ఆయనతో పాటు చాలా మంది స్థానిక వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉంటున్న వంగవీటి రాధ, పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తన అనుచరుల వద్ద చాలాసార్లు ప్రస్తావించారట. గతేడాది తన తండ్రి, దివంగత నేత వంగవీటి రంగాపై వైఎస్సార్‌సీపీ నాయకుడు పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. గౌతం రెడ్డి విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుపై రాధ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగాను అభిమానించే వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, ఆయనను విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. గౌతం రెడ్డి ఎంత? ఆయన బతుకెంత ? అని రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం పార్టీ కార్యక్రమాలకు రాధా కాస్తా దూరంగానే ఉంటున్నారు.
కొద్ది నెలల క్రితం విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఆయనకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్‌ను వైఎస్ జగన్ కేటాయించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గాన్ని జగన్ కన్ఫార్మ్ చేశారని సమాచారం.
వాస్తవానికి ఆ సీటుపై వంగవీటి రాధ ఎప్పటినుంచో ఆశలతో ఉన్నారు. విష్ణు రంగ ప్రవేశం తరువాతనే రాధ తొలిసారిగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాధ టీడీపీ నుంచి ఆ సీటు తనకిస్తానన్న హామీ వస్తే, పార్టీ మారుతానని చెప్పినట్టు ఆయన అనుచర వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి విజయవాడ సెంట్రల్ పరిధిలో మల్లాది విష్ణుతో పోలిస్తే, వంగవీటి రాధ బలమైన నేతగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాధకు టీడీపీ నుంచి అసెంబ్లీ సీటును ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా.. రాధ రాకను స్వాగతిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
2004లో వంగవీటి రాధాకృష్ణను రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాధాక‌ష్ణ బయటకి వచ్చి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి స్వల్ప తేడాతో ఓడిపోయారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయినప్పటికీ రాధాకృష్ణ ప్రస్తుతం కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ప్రతి సంవత్సరం రంగా జయంతి, వర్ధంతిలను విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు ఘనంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారితే బేటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటీకే వైసీపీ టీకెట్‌పై గెలిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీలో చేరిపోయారు. తాజాగా రాధ కూడా టీడీపీలో చేరితే విజయవాడలో వైసీపీ గట్టి ఎదురు దెబ్బ తగలడమే కాకుండా.. ఆపార్టీ నగరంలో దాదాపు ఖాళీ అవుతుంది. అయితే, రాధ నిజంగానే పార్టీ మారనున్నారా? లేదా? అన్నది ఆయనే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రాధ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది. రాధ, పవన్ కల్యాణ్ ఒకే సామాజిక వర్గానికి (కాపు) చెందిన వారు కావడంతో ఆయన జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.