అమరావతి పర్యటనకు సిద్దమవుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్

Spread the love

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 27న నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రానున్నారు. అక్కడే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాష్ట్రపతి వస్తున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ డిసెంబర్ 27న గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఆయన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయానికి వెళ్లనున్నారు. విశ్వవిద్యాలయంలో జరగనున్న ఇండియన్‌ ఎకనామిక్స్‌ అసోసియేషన్‌ సదస్సుల్లో పాల్గొంటారు.

అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి సచివాలయానికి వెళతారు. అక్కడే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఫైబర్‌గ్రిడ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. వినియోగదారులతో రాష్ట్రపతి సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత సచివాలయంలో ఒకటో బ్లాక్‌లో ఏర్పాటు చేసిన రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ పనితీరును రాష్ట్రపతి స్వయంగా పరిశీలించనున్నారు. ఈ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతికి వివరించనున్నారు.

రాష్ట్రపతి రాక సందర్భంగా తీసుకోవాల్సి భద్రతా చర్యలు, ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ డీజీపీ సాంబశివరావుతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం డిసెంబర్ 7న విశాఖపట్నం వచ్చిన సంగతి తెలిందే. పర్యటనలో భాగంగా టీయూ 142 యుద్ధ విమాన ప్రదర్శనశాలను రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఏయూలోని పలు భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఫైబర్‌గ్రిడ్‌ను ప్రారంభించాల్సిదిగా సీఎం చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.