నా జోలీకి వస్తే.. ఏపీనే కట్ చేస్తా..

Spread the love

ఏపీలో మిత్రపక్షాలైన అధికార టీడీపీ- బీజేపీల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలపై దేవాదాయ శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. తాను ప్రశ్నిస్తే చాలామందికి బాధ కలుగుతుందని, తనను నిలదీసే పరిస్థితి వస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తానని హెచ్చరించారు. తనను కట్ చేయాలని చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌నే కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. సహనానికి హద్దులుంటాయని, మూడున్నరేళ్లు సహనంతోవున్నానని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి పని చేస్తున్నామని గుర్తుచేశారు. తాడేపల్లిగూడెం మండలంలోని రామన్నగూడెంలో బుధవారం జన్మభూమి సభ నిర్వహించారు. ఈసందర్భంగా ‘ఈ రామన్నగూడెంలో ఏ కార్యక్రమాలకు నన్ను పిలవడంలేదు.. నా పాత్ర లేకుండా ఇక్కడ ఏ పనీ జరగదు.. నా నియోజకవర్గంలో నన్నో అంటరానివాడిగా చూసే పరిస్థితి ఏర్పడింది. నన్ను నిలదీయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా.. నన్ను కట్ చేయాలని ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్ చేస్తా’ అని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూస్తున్నారని, స్థానికంగా జరిగే కార్యక్రమాలకు తనను టీడీపీ నేతలు ఆహ్వానించలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తానేమైనా శత్రువునా? కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదా? అంటూ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుపై మంత్రి మాణిక్యాలరావు ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గాన్ని కేంద్రం నిధులతోనే అభివృద్ధి చేశానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని, అడ్డుకోవాలని చూస్తే రెచ్చిపోతానని హెచ్చరించారు. జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు కూడా ఇదే నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుని మంత్రికి సమాచారం ఇవ్వకుండా రోజూ జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెం సభలో మంత్రి పాల్గొనాల్సి ఉండగా ఆయన రావడం ఆలస్యంకావడంతో అప్పటికే ఈ సభకు హాజరైన బాపిరాజు మంత్రిని ఉద్దేశించి విమర్శలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సహకరించడం లేదంటూ ఆరోపించారు.

తర్వాత సభకు హాజరైన మంత్రిమాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో మంత్రి కూడా జెడ్పీ చైర్మన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కంటే ముందు ఈ వేదికపైకి వచ్చి వెళ్లిన ఒకటో కృష్ణుడు నేను తప్ప ఇంకొకడు అభివృద్ధి చేయలేడని అన్నారంట. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే, పంచాయతీరాజ్‌ విభాగం ద్వారా జిల్లా పరిషత్‌ ఖర్చుపెట్టే పరిస్థితి. నేను అక్కడ నిధులు ఆపితే ఇక్కడ విలవిల్లాడతారు. స్పష్టంగా చెబుతున్నా, ఒక రాష్ట్ర మంత్రిగా , క్యాబినెట్‌లో భాగస్వామిగా ఉన్న వ్యక్తిని గురించి ఇదే వేదికపై చులకనగా మాట్లాడటం అనేది తీవ్రమైన విషయం. చాలా కాలంగా చూసీచూడనట్టు పోయా ఖబడ్దార్‌’ అని మాణిక్యాలరావు హెచ్చరించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.