మరో అరుదైన గౌరవం కేటీఆర్‌కు దక్కింది

Spread the love

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. దావోస్‌లో నిర్వహించనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు హాజరుకావాలంటూ ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. స్విట్జర్లాండ్ లో జనవరి 23 నుంచి 26 వరకు జరుగనున్న ఈ సదస్సులో ప్రపంచదేశాల నుంచి దాదాపు 2500మందికి పైగా వ్యాపార-వాణిజ్య, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.

పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో కేటీఆర్ సమావేశమై చర్చించనున్నారు. సాధారణంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు మాత్రమే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తుంది. తొలిసారిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆహ్వానించడం విశేషం. గతంలో చైనాలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఫోరం ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ప్రధానంగా పారిశ్రామిక విధానానం, పెట్టుబడుల అవకాశాలను ప్రపంచం ముందుంచుతామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందన్నారు. డిల్లీలో తెలంగాణ ప్రభుత్వ రెసిడెంట్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మిట్ లో కేటీఆర్ కీలకపాత్ర పోషించి.. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే..

Loading...

Leave a Reply

Your email address will not be published.