హిమాచల్ 14వ సీఎంగా జైరాం ఠాకూర్ ప్రమాణం

Spread the love

హిమాచల్‌ప్రదేశ్‌ 14వ సీఎంగా జైరామ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రిడ్గే మైదానంలో బుధవారం ఠాకూర్‌చేత ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ ప్రమాణస్వీకారం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో వచ్చిన బీజేపీ కార్యకర్తలతో రిడ్గే మైదానం కాషాయమయం అయింది. మైదానంలో ఏర్పాటు చేసిన మోదీ, అమిత్ షా, జైరామ్ ఠాకూర్‌ల బ్యానర్లు, కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.1998లో తొలిసారిగా జైరామ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా హిమాచల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెరాజ్ నియోజకవర్గం నుంచి ఠాకూర్ గెలుపొందారు. ఈయన గతంలో మంత్రిగా కూడా పని చేశారు. 1952 నుంచి హిమాచల్ ప్రదేశ్‌‌ను ఐదుగురు సీఎంలు పరిపాలించారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్‌‌ వారు కాగా ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. తొలి సీఎం యశ్వంత్ సింగ్ పర్మార్, ఆ తర్వాత వచ్చిన జుబ్బల్ కొథ్కాయ్, శాంతాకుమార్, ఠాకూర్ రాంలాల్, వీరభద్ర సింగ్, ప్రేమ్‌‌కుమార్ థుమాల్ రాష్ట్రాన్ని పాలించారు. తాజాగా హిమచల్‌ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఇటీవల జరిగిన హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 66 నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ 44 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 21 స్థానాలకే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం బీజేపీ వశమైంది. అయితే బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలబెట్టిన ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో సీఎం‌గా జైరాం ఠాకూర్‌ను నియమించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Loading...

Leave a Reply

Your email address will not be published.