హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Spread the love

తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారని బూతు పురాణం అందుకున్నారు. రాయడానికి వీల్లేని భాషలో విరుచుకుపడ్డారు. గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ముద్రించిన 2018 ఏడాది క్యాలెండర్‌ను నాయిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తిట్టినోళ్లు నేడు ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని అన్నారు. తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నట్టు చెప్పారు. మగాడు అంటే మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డేనని.. నాడు చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చలేదని నాయిని వ్యాఖ్యానించారు.

1969 ఉద్యమ స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, ఎన్నో శక్తులు అడ్డుకున్నా తెలంగాణ రాష్ట్రం సాధించి చూపించామని నాయిని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంటు అందజేస్తూ సీఎం కేసీఆర్‌ కొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. 1969 ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవిస్తుందన్న నాయిని… వారందరికీ పింఛన్లు, గుర్తింపు కార్డులు, బస్‌పాస్‌లు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే ఉద్యమంలో అమరులైన కుటుంబాలను మాత్రం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం, ఇంటిలో ఒకరికి ఉద్యోగం ప్రభుత్వం కల్పిస్తుందని నాయిని హామీ ఇచ్చారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.