కేసీఆర్‌ వ్యాఖ్యలు బాగాలేవు.. ఏపీని కేంద్రం ఖచ్చితంగా ఆదుకోవాలి – చంద్రబాబు

Spread the love

అభివృద్ధిలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కు పోలికేలేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యల బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతిలో రెండోరోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారన్న కేసీఆఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995కు ముందు.. తరువాత హైదరాబాద్‌ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజనలో యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్నామని.. ఇంకా రూ.35వేల ఆదాయం పెరిగితేనే పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయికి చేరుకోగలమని అభిప్రాయపడ్డారు.

ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం సాయం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాడు యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే ఏపీకి ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కాబట్టే ఏపీ ప్రజలు.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారన్నారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారనడం సరికాదన్నారు. 1995కు ముందు, తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధిని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కాగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌–2018’కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపకముందు కూడా ధనిక రాష్ట్రమేనని, ఏపీతో తెలంగాణను పోల్చవద్దని అన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, ఏపీకంటే చాలా విషయాల్లో ఎంతో ముందుందని, అసలు పోలికే లేదని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

‘తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో పోల్చకండి. మాది ముందు నుంచి మిగులు రాష్ట్రం. ఇదొక ప్రత్యేక రాజ్యంగా ఉండేది. తెలంగాణ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. నేను చెప్పడం లేదు ఈ విషయాలు. భారత ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ మధ్య ఎలాంటి పోటీ లేదు. ఉండదు కూడా. ఎందుకంటే మేం ఇప్పటికే చాలా చాలా ఉన్నతస్థితిలో ఉన్నాము. పాజిటివ్‌గా ముందుకు వెళుతూ కష్టపడితే తప్పకుండా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.