2జీ స్కాం తీర్పుపై ఏమన్నారో తెలుసా..?

Spread the love

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాం కేసులో అందరూ నిర్దోషులేనని పటియాల కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు విచారణలో ఉన్న ఈ కేసును పటియాలా హౌజ్ కోర్టు కొట్టి వేసింది. నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పుపై తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు.

మన్మోహన్ సింగ్: కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. యూపీఏపై ఎలాంటి ఆధారాలు లేకుండానే చెడు ప్రచారం జరిగిందనే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైంది.

కపిల్ సిబల్: ప్రధాని మోదీ పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వాలి. 2జీతో పాటు పలు కుంభకోణాల్లో యూపీఏ ప్రభుత్వం కూరుకుపోయిందనే తప్పుడు ప్రచారంతోనే మోదీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కోర్టు తీర్పుతో అసలు విషయం ఏమిటో అందరికీ తెలిసింది. 2జీ అనేది విపక్షానికి చెందిన అబద్ధాలతో కూడిన స్కాం అనేది రుజువైంది.

చిదంబరం: గత ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు కుంభకోణంలో ఉన్నారనే ప్రచారాలు తప్పు. ఈ రోజు అదే విషయం రుజువైంది. న్యాయమే గెలిచింది.

అరుణ్ జైట్లీ : తాను తీర్పు జోలికి వెళ్లడం లేదు. అయితే 2జీ స్పెక్ట్రం కేటాయింపుల విధానంపైనే తాను మాట్లాడుతున్నాను. కేటాయింపులు పక్షపాతంతో జరిగినందునే దానిని తప్పుపడుతూ సుప్రీంకోర్టు అప్పట్లో స్పెక్ట్రం కేటాయింపు లైసెన్సులను రద్దు చేసింది. తీర్పు ‘బ్యాడ్జ్ ఆఫ్ హానర్’ కాదు, తీర్పుతో యూపీఏ అమాయకత్వం రుజువైనట్టు కూడా కాదు. యూపీఏ తప్పిదాల వల్లే ఖజానాకు నష్టం వాటిల్లింది.

సుబ్రహ్మణ్యస్వామి: సరైన ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టులో అప్పీల్ చేయాలి.

శశి థరూర్: అమాయకులను ఇబ్బంది పెట్టారనే విషయాన్ని కోర్టు గుర్తించింది. న్యాయం గెలిచింది.

ఖుష్బూ: కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకేలు క్షమాపణలు చెబుతాయా? అంటూ ట్వీట్.

Loading...

Leave a Reply

Your email address will not be published.