సై అంటే సై..సమయం,స్థలం చెప్పు.?

తెలంగాణలో విద్యుత్ సరఫరా విషయంలో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిరంతర విద్యుత్‌ సరఫరా ఘనత మాదంటే మాదంటూ సవాళ్లు ,ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తే కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోంది టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాదు కరెంట్‌పై కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డి చెబుతున్న లెక్కలన్నీ తప్పులని నిరూపిస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. అయితే,తాము చెప్పే లెక్కలు అబద్ధమైతే ప్రజలు వేసే ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

విద్యుత్‌ రంగంపై కాంగ్రెస్‌తో సవాల్‌కు తాను సిద్ధమని, సమయం, స్థలం రేవంత్‌ నిర్ణయించినా అభ్యంతరం లేదని సుమన్ అంటున్నారు. మా వైపు నుంచి నాతో పాటు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌ చర్చకు వస్తారు.. చెప్పేది అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానని ఎంపీ సుమన్ శపథం చేశారు. సమయం, స్థలం మీరే చెప్పండి.. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లేదా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ అయినా అమరవీరుల స్థూపం వద్ద అయినా సరేనని తేల్చి చెప్పారు. ఇక, రేవంత్ టీఆర్‌ఎస్‌ బహిరంగ సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు. ‘ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మేము రెడీ. ఎక్కడికి రావాలో చెప్పండి? ఈ అంశంపై చర్చిస్తామంటే ప్రగతి భవన్ కు అయినా సరే వస్తాం.

విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలను మేము నిరూపిస్తాం. ఎవరు మాట్లాడుతున్నది తప్పో, ఎవరు ముక్కు నేలకు రాయాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అని రేవంత్ దీటుగా ప్రతి స్పందించారు. ఎమ్మెల్యే సంపత్‌, శ్రవణ్‌తో చర్చకు వస్తానని రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. బీహెచ్‌ఈఎల్‌ ద్వారా తమకు కావాల్సినవారికి విద్యుత్‌ ప్రాజెక్టుల పనులు ఇచ్చారని రేవంత్ ఆరోపణలకు దిగారు. విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్లు అప్పు చేయబోతున్నారని విమర్శించారు. ఐఏఎస్‌లను పక్కనపెట్టి ఎందుకు రిటైరైన అధికారులను ఉన్నత పదవుల్లో నియమించారని ఆయన ప్రశ్నించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.