రైతులకు కొత్త సంవత్సర కానుక ఇచ్చిన కేసీఆర్

Spread the love

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరునెలల్లోనే కోతల్లేని కరంటునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేయబోతున్నారు. నూతన సంవత్సర కానుకగా తెలంగాణ రైతాంగానికి డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి 24 గంటలలపాటు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా చేయలేని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు 9గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో 24 గంటల సరఫరా చేస్తున్నా, ఉచితంగా ఇవ్వడం లేదు. ఇప్పుడు తెలంగాణ మాత్రమే వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా చరిత్ర సృష్టించబోతున్నది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.01 గంటలనుంచి తెలంగాణ వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరా చేయనున్నారు.2017 జూలై నుంచి పాత మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ అందించారు.

ఆ తర్వాత 2017 నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 23 లక్షల పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా నిరంతర విద్యుత్ సరఫరాచేశారు. తలెత్తే సమస్యలు, లోటుపాట్లను అంచనా వేసుకొని సరిదిద్దుకున్నారు. వ్యవసాయంతోపాటు మిగతా అన్ని వర్గాలకు అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా.. 11వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్‌ను అంచనావేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 23 లక్షల పంపుసెట్లకు నిరంతరాయ కరంట్ సరఫరాకు సర్వం సన్నద్ధమైంది. వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్‌కోసం రూ.12,610 కోట్లతో జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంయుక్తంగా ఏర్పాట్లుచేశాయి. సీఎం ఆదేశాలమేరకు రైతాంగానికి కొత్త సంవత్సర కానుక అందించబోతున్నారు. రైతులకు 24 గంటల కరంటుతో ఏర్పడే డిమాండ్‌ను ముందుగానే అంచనావేసిన విద్యుత్ సంస్థలు అందుకు తగినవిధంగా సన్నద్ధమయ్యాయి. నిరంతర విద్యుత్ సరఫరాకు జనవరి 1 గడువు సమీపించడంతో గురువారం విద్యుత్‌సౌధ నుంచి జెన్ కో-ట్రాన్స్ కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు పరిస్థితిని సమీక్షించారు. ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావుతో మాట్లాడారు. వ్యవసాయానికి 24 కరంటుతో సాధారణంగా పడే లోడ్‌తోపాటు ఎక్కువ లోడ్ వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు వేశామని, దానికి అనుగుణంగా సరఫరా చేయనున్నామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వివరించారు.

ప్రస్తుతం 9,500 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడుతున్నదని, వ్యవసాయానికి 24 గంటలతోపాటు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, పెరిగే పరిశ్రమలకు కరంటు సరఫరాచేస్తే మరో 50% విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించాలనే సీఎం సంకల్పానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో జరుగాలని, విద్యుత్ సంస్థల నిర్వహణ సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఉండాలని సీఎం మొదటి నుంచి గట్టిగా భావించారని, ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలొస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. నిరంతర సరఫరాతో లోడ్‌లు క్రమంగా పెరుగుతాయని, ఇందుకు తగినట్టుగా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేశామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రభాకర్‌రావు తెలిపారు. పంపిణీ, సరఫరా వ్యవస్థలు సక్రమంగా నడిచేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్నిస్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని చెప్పారు. వచ్చే జూన్ నుంచి ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున లోడ్ మరింత పెరుగుతుందని.. అప్పుడు కూడా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.