తిరుమలకు పోటెత్తిన భక్తజనం..క్యూలైన్లలో ఇబ్బందులు !

Spread the love

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఏపీ మంత్రులు శిద్దారాఘవరావు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. వీరితో పాటుగా ఏపీ చీఫ్‌విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీల తాకిడితో అధికారులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తులను క్షణంగా తనిఖీలు చేసి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు రాత్రివేళ మంచు కురుస్తుండటంతో భక్తులు క్యూలైన్లలో ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాంతో ముందుగానే వారిని కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించారు.

గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఒకటో కాంప్లెక్సులో ఏడు కంపార్ట్‌మెంట్లు, రెండో క్యూ కాంప్లెక్స్‌ అయితే పూర్తిగా భక్తులతో నిండిపోయింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు తిరుమలకు వెళ్లి దేవదేవుని దర్శించుకుందామని వేచిచూస్తున్న సుమారు లక్ష మందికి పైగా భక్తులు క్యూ లైన్లలో నానా కష్టాలూ పడుతున్నారు. దాదాపు 24 గంటలకు పైగా భక్తులు క్యూ లైన్లలో నిరీక్షిస్తుండగా, చలి తీవ్రత వారిని నానా ఇబ్బందులూ పెట్టింది. క్యూ లైన్లలోని భక్తుల కన్నా, బయట ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, క్యూ లైన్లలో వేచి ఉన్నవారు మరింత ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పిల్లలతో వచ్చిన వారు చలికి తాళలేకపోయారు. అద్దె గదులు దొరికే పరిస్థితి లేకపోవడంతో, రోడ్లపై సుమారు 30 వేల మంది పడిగాపులుగాస్తున్నారు. కేవలం వీఐపీలకు పెద్దపీట వేసిన టీటీడీ అధికారులు సామాన్యులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వీఐపీలకు దర్శనాలను ముగించి, సామాన్య భక్తులను వైకుఠ ద్వారం ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.

అంతకుముందు రాత్రి 11 గంటలకే ఏకాంత సేవను ముగించి, ఆపై అర్ధరాత్రి 12.0కు ఆలయాన్ని తిరిగి తెరిచారు. తిరుప్పావై ప్రవచనాలను ఏకాంతంగా నివేదించిన తరువాత, అభిషేకం సైతం ఏకాంతంగానే జరిగింది. ఆ తరువాత ప్రొటోకాల్ వీఐపీ దర్శనం మొదలైంది. రేపు అర్ధరాత్రి వరకూ స్వామివారు విరామం లేకుండా భక్తులకు దర్శనం ఇవ్వనుండగా, సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లక్షమందికి పైగా భక్తులు తిరుమల కొండపై ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.