‘జై సింహా’ మూవీ రివ్యూ

Spread the love

నందమూరి నటసింహా బాలకృష్ణ హీరోగా నయనతార, హరిప్రియ, నటాషా దోషీ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘జై సింహా’. తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమా అన్నికార్యక్రమాలను పూర్తిచేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా! నరసింహా పాత్రలో బాలకృష్ణ, గౌరీ పాత్రలో నయనతార నటించారు.

కథ:

నరసింహా తన కొడుకును తీసుకొని ఎలాంటి గొడవలు లేని ప్రాంతానికి వెళ్లి, ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు. చివరకు తమిళనాడులోని కుంభకోణంకి చేరతాడు. అక్కడ మురళీ మోహన్ దగ్గర డ్రైవర్‌గా పనిలో చేరతాడు. అయితే అనుకోకుండా అక్కడి లోకల్ ASP మరియు కొంతమంది లోకల్ రౌడీలతో చిన్న సమస్యలో ఇరుక్కుంటాడు నరసింహా. ఇదిలా వుండగా.. అక్కడి లోకల్ రౌడీ గ్యాంగ్ నరసింహా కొడుకును కిడ్నాప్ చేస్తారు. ఆ గ్యాంగ్‌తో నరసింహా పోరాడి… చివరకు తన కొడుకును తీసుకొని వెళ్లిపోయే సమయంలో ASP వచ్చి.. తన కొడుకును కాపాడినందుకు థాంక్స్ చెబుతాడు. అదే సమయంలో గౌరీ ఎంట్రీ ఇచ్చి.. తన కొడుకుకి దూరంగా వుండమంటు నరసింహాకి వార్నింగ్ ఇస్తుంది. అసలు నరసింహా కొడుకెవరు? గౌరీ ఎవరు? నరసింహాకి గౌరీకి వున్న సంబంధం ఏంటీ? ASPకి గౌరీకి వున్న సంబంధం ఏంటీ? కుంభకోణంకి నరసింహా ఎందుకు రావాల్సి వచ్చింది? ఇంతకీ నరసింహకి కొడుకెలా వచ్చాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే వెండితెరపై ‘జై సింహా’ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన పంజా పవర్ చూపించేసాడు. లుక్స్ పరంగా రెండు వేరియేషన్స్‌ను బాగా చూపించాడు. అభిమానులు కోరుకునే విధంగా అదిరిపోయే డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, డాన్సులతో థియేటర్లో దుమ్మురేపేసాడు. నరసింహా పాత్రలో ఉగ్రనరసింహుడిగా తన విశ్వరూపం ప్రదర్శించేసాడు. ఇక గౌరీ పాత్రలో నయనతార చాలా బాగా చేసింది. హోమ్లీ లుక్స్‌తో, తన గ్లామర్‌తో అద్భుతమైన నటనను కనబరిచింది. బాలయ్య, నయనతారల కెమిస్ట్రీ బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. ఇక హరిప్రియ, నటాషా దోషీలు పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. నెగెటివ్ పాత్రలో నటించిన కాలకేయ ప్రభాకర్, అశుతోష్ రానాలు బాగా చేసారు. ప్రకాష్, మురళీ మోహన్‌ తదితర నటీనటులు వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు.
సినిమా విషయానికొస్తే… తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి నరసింహా ఏం త్యాగం చేసాడు, తనవాళ్ల కోసం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అనేది ‘జై సింహా’లో మెయిన్ కథాంశంగా కనిపిస్తోంది. సినిమాలో కొన్ని కొన్ని ట్విస్టులు తప్ప.. మిగతాదంతా పాత కథే అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ స్క్రీన్‌ప్లే పరంగా కాస్త మ్యాజిక్ చేసినట్లుగా అనిపిస్తోంది. పాత స్టోరీనే స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. ఫస్ట్‌హాఫ్‌లో బాలయ్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ సినిమాకు భారీ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఎనర్జిటిక్‌గా సాగితే.. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ డ్రామాతో సాగుతోంది. క్లాసు, మాసు ప్రేక్షకులకు నచ్చే విధంగా ‘జై సింహా’ రూపుదిద్దడం విశేషం. కానీ ఇందులో బాలయ్య ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాస్త నచ్చకపోవచ్చు. కానీ బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రం ఆ యాక్షన్ ఎపిసోడ్స్ పండగేనని చెప్పుకోవాలి. ముఖ్యంగా అమ్మకుట్టి పాటలో బాలయ్య స్టెప్పులకు థియేటర్లో భారీ రెస్పాన్స్ వస్తోంది. అదిరిపోయే స్టెప్పులతో బాలయ్య దుమ్మురేపేసాడు. ఇలాంటి కమర్షియల్ ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కామెడీ బాగా నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. బ్రహ్మానందంతో చేయించిన కామెడీలో ఎలాంటి కొత్తదనం లేదు. ఏదో కావాలనే కామెడీ జోడించినట్లుగా అనిపిస్తోంది. అలాగే కొన్నిచోట్ల కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తోంది. మొత్తంగా చూస్కుంటే ఈ సంక్రాంతికి బాలయ్య ‘జై సింహా’తో తన అభిమానులకు భారీ కానుకనే అందించాడని చెప్పుకోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు:

తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ మాస్ పల్స్‌ను బాగానే పట్టుకున్నాడు. ముఖ్యంగా బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్‌ను సంతృప్తి పరిచే విధంగా యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్‌ను బాగా డిజైన్ చేసారు. దర్శకుడిగా మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. ఇక ఈ సినిమాకు కథ, డైలాగ్స్‌ అందించిన రత్నం పనితీరు బాగుంది. కథ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే సినిమా స్థాయి మరింత పెరిగి వుండేది. ఇక డైలాగ్స్‌కు థియేటర్లో మోత మోగిపోతున్నాయి. సి. రాంప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. బాలయ్యను చాలా యంగ్‌గా చూపించారు. చిరంతన్ భట్ అందించిన సంగీతం పర్వాలేదనిపించినా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ అందించిన యాక్షన్ ఎపిసోడ్స్‌‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత సి.కళ్యాణ్ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా… :

సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రం ‘జై సింహా’తో అభిమానులు, ప్రేక్షకులకు భారీ కానుకను అందించాడని చెప్పుకోవచ్చు.

Loading...

Leave a Reply

Your email address will not be published.