‘హలో’ మూవీ రివ్యూ

Spread the love

కథ : రోడ్ల మీద వయోలిన్ వాయించుకుంటూ డబ్బులు సంపాదించుకునే కుర్రోడు శీను. అతనొక అనాధ. తనకు జున్ను అనే అమ్మాయి పరిచయమవుతుంది. వీరిద్దరూ కలిసి తొలి పరిచయంలోనే బాగా దగ్గరవుతారు. తన కోసం ప్రతిరోజు ఓ పార్క్ వద్ద ఏడున్నరకు ఎదురుచూస్తానంటూ జున్నుకి ప్రామిస్ చేస్తాడు శీను. అనుకోకుండా జున్ను ఫ్యామిలీ న్యూడిల్లీకి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఓ వంద రూపాయల నోటు మీద తన నెంబర్ రాసి విసిరేస్తుంది జున్ను. కానీ ఆ నోట్ మిస్సవ్వడం.. సడెన్‌గా శీనుకి యాక్సిడెంట్ అవడం జరుగుతుంది. అలా యాక్సిడెంట్ చేసిన రమ్యకృష్ణ… తనకు పిల్లలు లేకపోవడంతో శీనుని దత్తత తీసుకొని అవినాష్‌గా పేరు పెడుతుంది. కానీ తన జున్ను కోసం ఈ 15 ఏళ్లు వెతుకుతూనే వుంటాడు శీను. అయితే జున్ను వున్న చోటు ఎక్కడో తెలిసిన క్షణంలో సడెన్‌గా అతని ఫోన్ ఎవరో కొట్టేస్తారు. అసలు ఆ ఫోన్‌లో ఏముంది? ఆ ఫోన్‌ కోసం ఎందుకంత ఫైట్ చేసాడు? అసలు జున్ను ఎవరో శీనుకి ఎలా తెలిసింది? మరి అవినాష్, ప్రియలు చివరికి కలిసారా లేదా అనే అంశాలు వెండితెరపైనే చూడాలి.

ఈ సినిమాలో శీను అలియాస్ అవినాష్ పాత్రలో అఖిల్ బాగా చేసాడు. కొన్ని కొన్ని సీన్లలో పర్వలేదనిపించాడు. యాక్షన్ సీన్లలో కుమ్మేసాడు. అదిరిపోయే స్టంట్లతో అదరగొట్టాడు. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ మరీ అంతగా అవసరం లేదనిపించేలా వున్నాయి. అనవసరమైన జంపింగ్‌లు మరీ ఎక్కువయ్యాయి. ఇక అఖిల్ ఇందులో చేసిన డాన్సులు తక్కువే కానీ బాగున్నాయి. రెండు, మూడు స్టెప్పులు తప్ప… పెద్దగా ఇందులో డాన్స్ మూమెంట్స్ ఏమి లేవు. ఇది అఖిల్ డాన్స్‌ను ఇష్టపడే ఫ్యాన్స్‌కు పెద్ద నిరాశే అని చెప్పుకోవాలి. హీరోయిన్ కళ్యాణ్ తన పాత్రలో బాగా చేసింది. చాలా ఇనోసెంట్‌గా కనిపిస్తూనే తన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. అఖిల్, కళ్యాణి‌ల జోడి బాగుంది. ఇక అఖిల్ తల్లితండ్రులుగా నటించిన రమ్యకృష్ణ, జగపతిబాబులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. కృష్ణుడు, అజయ్ తదితర నటీనటులు పర్వాలేదనిపించారు.

ఇక సినిమా విషయానికొస్తే… సినిమా మొదలైన 10 నిమిషాలకే అసలు కథ ఏంటో తెలిసిపోతుంది. ఇక అక్కడి నుంచి సినిమాలో ఎక్కడ కూడా వేగం కనిపించదు. బాగా స్లో నెరేషన్‌తో సాగుతుంది. హలో సినిమాలో ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం మేజర్ మైనస్ పాయింట్. ఫస్ట్‌ హాఫ్, సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా పూర్తిగా స్లో నెరేషన్‌‌తో సాగడం వల్ల చూసే ప్రేక్షకులు తర్వాత ఏం జరుగబోతుందో ముందుగానే చెప్పేయగలరు. సినిమా పూర్తిగా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు.

ఇక టెక్నికల్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే… ఈ సినిమాకు పి.ఎస్. వినోద్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. స్టంట్స్ బాగున్నాయి కానీ మరి మితిమీరిపోయాయి. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ తను అనుకున్న కథను సరిగ్గా చూపించడంలో విఫలమయ్యాడు. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోగా… స్క్రీన్‌ప్లే సైతం సాగదీసినట్లుగా వుండటంతో చూసే ప్రేక్షకుల సహనానికి ఓ పరీక్షే అని చెప్పుకోవచ్చు. నిర్మాత నాగార్జున అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా Hello చిత్రం తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పుకోవచ్చు.

Loading...

Leave a Reply

Your email address will not be published.